District Collector Annamayya
Annamayya district is a district in the Indian state of Andhra Pradesh. Established on April 4, 2022, by Andhra Pradesh Government.
The administrative headquarters is setup at Rayachoti.
పత్రికా ప్రకటన
ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో విగ్రహాలను తయారు చేయకుండా కఠిన చర్యలు తీసుకోండి.....
....జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి
రాయచోటి, జూలై 16:
అన్నమయ్య జిల్లాలో వినాయక చవితికి మరియు దసరాకు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో విగ్రహాలను తయారు చేయకుండా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి అధికారులను ఆదేశించారు.
గురువారం సాయంత్రం రాయచోటి కలెక్టరేట్ లోని తన చాంబర్ నందు, జిల్లా కలెక్టర్ అధ్యక్షతన, పర్యావరణ శాఖ అధికారులు, ఆర్ డి ఓ లు, మునిసిపల్ కమిషనర్లు, డిపిఓలతో కూడిన పర్యావరణ పరిరక్షణ కమిటీ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా రాయచోటి, మదనపల్లి, రాజంపేట ఆర్డీవోలు, కమిషనర్లు మరియు డిపిఓ తమ పరిధిలో ఎక్కడెక్కడ ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో విగ్రహాలు తయారు చేస్తున్నారు, ఎవరెవరు తయారు చేస్తున్నారు వంటి విషయాలపై కలెక్టర్ కు వివరించారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్తో విగ్రహాలు తయారు చేస్తున్న వారికి నోటీసులు ఇచ్చామని, ఎట్టి పరిస్థితులలో విగ్రహాలను పిఓపి తో తయారు చేయకూడదని, మట్టితోనే తయారు చేసేలా ఆదేశాలు జారీ చేశామని కలెక్టర్కు తెలిపారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి మాట్లాడుతూ.... రాయచోటి, మదనపల్లి, రాజంపేట, బి.కొత్తకోట, మునిసిపాలిటీలలో ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో విగ్రహాలు తయారు చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, అధిక మొత్తంలో జరిమానాలు విధించాలని ఆర్డీవోలకు మరియు మునిసిపల్ కమిషనర్లకు ఆదేశాలు జారీ చేశారు. పంచాయతీలలో ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో విగ్రహాలు తయారు చేస్తున్న వారిపై సంబంధిత చట్టాలను ఉపయోగించి కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా పంచాయతీ అధికారిని ఆదేశించారు. వినాయక చవితికి మరియు దసరాకు విగ్రహాలను మట్టితోనే తయారు చేసే విధంగా అన్ని రకాల చర్యలు తీసుకోవాలన్నారు. మట్టితో చేసిన విగ్రహాలను మాత్రమే ప్రజలందరూ వినియోగించి పర్యావరణ పరిరక్షణలో ప్రజలందరూ భాగస్వాములు అయ్యేవిధంగా ప్రజలందరికీ అవగాహన కల్పించాలని ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు.
ఈ సమావేశంలో రాయచోటి ఆర్డిఓ రంగస్వామి, మదనపల్లి ఆర్డీవో హరిప్రసాద్, రాజంపేట ఆర్డిఓ మోహన్ రావు, రాయచోటి మదనపల్లి మున్సిపల్ కమిషనర్లు, డిపిఓ ధనలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.
---- Issued by DIPRO, Annamayya District ----
పత్రిక ప్రకటన
మట్టి విగ్రహాలతోనే పర్యావరణ పరిరక్షణ సాధ్యం.....
జిల్లాలో ఉన్న నీటి వనరులను కాపాడాల్సిన బాధ్యత మన అందరిదీ....
..... జిల్లా ప్రజలకు పిలుపునిచ్చిన జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి
రాయచోటి, జూలై 18:
మట్టి విగ్రహాలతోని పర్యావరణ పరిరక్షణ సాధ్యమని, మట్టి విగ్రహాలను మాత్రమే ప్రజలందరూ వినియోగించాలని, జిల్లాలో ఉన్న నీటి వనరులను కాపాడాల్సిన బాధ్యత మన అందరిదీ అని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు.
గురువారం సాయంత్రం రాయచోటి కలెక్టరేట్ లోని తన ఛాంబర్ నందు మట్టి విగ్రహాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు తయారుచేసిన పోస్టర్ను జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి ఆవిష్కరించారు.
వినాయక చవితి మరియు దుర్గా పూజ పండుగలకు తయారుచేసే విగ్రహాలను ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేయవద్దని విగ్రహ తయారీదారులకు ఈ సందర్భంగా సూచించారు. అన్నమయ్య జిల్లాలో వర్షపాతం తక్కువగా ఉంటుందని, మనకు పడే ఆ తక్కువ వర్షాన్ని మరియు నీటి వనరులను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉందని తెలిపారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో చేసిన విగ్రహాలను నిమజ్జనం చేయడం వల్ల నీటి వనరులు కాలుష్యం అవుతాయని, భూమి సారవంతం తగ్గుతుందని, తాగునీటికి సమస్య ఏర్పడుతుందని, మొత్తంగా పర్యావరణ కాలుష్యం ఏర్పడుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ అంశాలను దృష్టిలో పెట్టుకొని ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసిన విగ్రహాలను కొనరాదని మట్టి విగ్రహాలను మాత్రమే వాడాలని జిల్లా ప్రజలందరికీ సూచించారు. ఉత్సవ సమితులు వినాయక చవితి పండుగను జరుపుకునేటప్పుడు తమ వంతు బాధ్యతగా మట్టి విగ్రహాలను మాత్రమే వినియోగించాలని సూచించారు.
---- Issued by DIPRO, Annamayya District ----
పత్రికా ప్రకటన
జిల్లా కలెక్టర్ ను కలిసిన నూతన ఎస్పీ విద్యాసాగర్ నాయుడు
మదనపల్లె, జూలై 17:-
అన్నమయ్య జిల్లా నూతన జిల్లా ఎస్పి గా బాధ్యతలు స్వీకరించిన జిల్లా ఎస్పి విద్యాసాగర్ నాయుడు బుధవారం మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి గారిని మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.... అన్నమయ్య జిల్లాలో ఎటువంటి సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో జిల్లా ప్రజలు ఉండే విధంగా పోలీస్ యంత్రాంగం పనిచేసి మన మన జిల్లాకు మంచి పేరు తీసుకురావాలన్నారు.
------------------////---------------
డివిజనల్ పిఆర్ఓ అన్నమయ్య జిల్లా
ఫర్ స్క్రోల్
మదనపల్లి
అన్నమయ్య జిల్లా
తేదీ: 17-07-2024
కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రివర్యులు నితిన్ గడ్గరి గారికి ఘన స్వాగతం
మదనపల్లి, జూలై 17:-
గౌరవ కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రివర్యులు నితిన్ గడ్గరి గారు మదనపల్లి పర్యటన సందర్భంగా బుధవారం మదనపల్లె పట్టణంలోని చిప్పిలి గ్రౌండ్ నందు ఏర్పాటుచేసిన హెలిపాడ్ కు మధ్యాహ్నం 2.45 గంటలకు చేరుకున్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రివర్యులకు రాష్ట్ర రవాణా, యువజన క్రీడా శాఖ మంత్రివర్యులు, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు, మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ బాషా, గారు జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి, గారు ఎస్పీ విద్యాసాగర్ నాయుడు, గారు జాయింట్ కలెక్టర్ ఫర్మన్ అహ్మద్ ఖాన్, గారు తదితరులు కేంద్రమంత్రివర్యులకు పుష్ప గుచ్చాలు అందజేసి ఘన స్వాగతం పలికారు.
అనంతరం చిప్పిలి హెలిప్యాడ్ నుండి మదనపల్లెలోని సత్సంగ్ ఫౌండేషన్ కు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి గారు బయల్దేరి వెళ్లారు.
-----------------------/////--------------------
డివిజనల్ పిఆర్ఓ అన్నమయ్య జిల్లా
పత్రికా ప్రకటన
జిల్లాలో ప్రజలందరికీ ఉచితంగా ఇసుక అందుబాటులో ఉండాలి....
.....జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి
రాయచోటి, జులై 16:
అన్నమయ్య జిల్లాలో ప్రజలందరికీ ఉచితంగా ఇసుక అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి అధికారులను ఆదేశించారు.
మంగళవారం సాయంత్రం రాయచోటి కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన నూతన ఇసుక పాలసీ అమలు కోసం జిల్లాలో ఉన్న చెయ్యేరు, బహుద, మాండవ్య, తదితర నదులలో ఇసుక పాయింట్లను గుర్తించాలని నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించారు. జిల్లాలో అక్రమ ఇసుక నిల్వాలపై కఠిన చర్యలు తీసుకొని ప్రజలందరికీ ఇసుక అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని గనులు, రెవెన్యూ, పోలీసు, రవాణా శాఖ అధికారులను ఆదేశించారు. ఉచిత ఇసుక పాలసీ వల్ల భవన నిర్మాణ కార్మికులకు, ప్రభుత్వం నిర్మించే భవనాలకు, ఇళ్లకు మరియు ప్రజలందరికీ ఉపయోగకరంగా ఉంటుందని ఈ సందర్భంగా తెలిపారు.
ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, రాజంపేట ఆర్డిఓ మోహన్ రావు, జిల్లా మైన్స్ శాఖ అధికారి రవి ప్రసాద్, డిపిఓ ధనలక్ష్మి, నీటి వనరుల శాఖ ఈఈ భరత్, ఆర్టీవో భరత్ చవాన్, గ్రామీణ నీటి సరఫరా శాఖ ఎస్ ఇ ప్రసన్నకుమార్, తదితరులు పాల్గొన్నారు.
---- Issued by DIPRO, Annamayya District ----
పత్రికా ప్రకటన
యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలి
నిరుద్యోగ సమస్యను నివారించాలి
జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి
రాయచోటి, జులై 16:-
లోకల్ డిమాండ్ ను పట్టి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని జిల్లా కలెక్టర్ చామకూరి సంబంధిత అధికారులకు సూచించారు.
మంగళవారం కలెక్టరేట్లోని మినీ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి జిల్లా స్కిల్ కమిటీ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి మాట్లాడుతూ.... రాష్ట్ర ప్రభుత్వం యువతకు మెండుగా ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ముందుకు వెళుతుందన్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ మంచి నిర్ణయానికి జిల్లాలోని అధికారులందరూ సమన్వయంతో మండలాలలో పర్యటించి నిరుద్యోగ యువతను గుర్తించాలన్నారు. ప్రతి మండలంలో లోకల్ డిమాండ్ ను బట్టి యువతకు ఉపాధి కల్పించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. గ్రామీణ ప్రాంతాలలో యువతకు ఉన్న స్కిల్స్ కాకుండా ఇంకా అదనంగా స్కిల్స్ నేర్పించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి ఒక్కరిని ఉద్యోగులుగా చేయాలనేదే ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ లక్ష్యసాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రతి సెక్టార్ లో లోకల్ డిమాండ్లు బట్టి జాబ్స్ కల్పించాలని లోకల్ లో డిమాండ్ లేకపోతే ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాలకు మన పిల్లలు వెళ్లడానికి వీలైనంత జాబ్స్ ఏమున్నాయో చూడాలన్నారు.
ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఫర్మన్ అహ్మద్ ఖాన్, జిల్లా స్కిల్ డెవలప్మెంట్ అధికారి హరికృష్ణ, డి ఆర్ డి ఎ పిడి సత్యనారాయణ, అగ్రికల్చర్ జెడి చంద్ర నాయక్, పశుసంవర్ధక శాఖ జెడి గుణశేఖర్ పిలై, తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.
---------------------/////----------------
డివిజనల్ పిఆర్ఓ అన్నమయ్య జిల్లా
పత్రికా ప్రకటన
ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ హెల్త్ స్కీం పొడిగింపు:
జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి
రాయచోటి, జూలై 16 :
రాష్ట్ర ప్రభుత్వం వర్కింగ్ జర్నలిస్టు హెల్త్ స్కీం పథకాన్ని 2024 - 25 ఆర్థిక సంవత్సరానికి పొడిగిస్తూ 12.07.2024న జీఓ యం.యస్ నెం.82 ను జారీ చేసినట్లు జిల్లా కలెక్టర్ మరియు డిఎంఏసి చైర్మన్ శ్రీధర్ చామకూరి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్ ద్వారా జర్నలిస్టులు, వారిపై ఆధారపడ్డ కుటుంబ సభ్యులకు ఏదైనా అనారోగ్యం సంభవించిన ప్రతిసారి రూ. 2 లక్షల వరకు విలువ చేసే వైద్యసేవలు అందుతాయని, ఇలా సంవత్సర కాలంలో ఎన్ని సార్లు అయినా పరిమితులు లేకుండా ఈ అవకాశాన్ని అందిస్తారని తెలిపారు. వర్కింగ్ జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్ ద్వారా జర్నలిస్టులు ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్ (EHS) తరహాలో వైద్య సేవలు పొందవచ్చన్నారు. వర్కింగ్ జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్ ద్వారా పొందే వైద్యసేవల విషయంలో ఎలాంటి ఆదాయ పరిమితులు లేవని, అదే విధంగా నిర్దేశిత చికిత్సలకు సంబంధించి ఉచిత ఓపీ సేవలు పొందవచ్చని ఆయన వివరించారు.
అక్రిడిటేషన్ పొందిన జర్నలిస్టులందరూ ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రకటనలో స్పష్టం చేశారు.
వెబ్ సైట్: www.cfms.ap.gov.in
చెల్లించవలసిన మొత్తం : రూ..1250 లు
Head of account: 8342 -00- 120-01-03-001-001
DDO code:
2703-0802- 003
ప్రీమియం చెల్లించిన జర్నలిస్టులు జత చేయవలసిన కాపీలు
1. ఒరిజినల్ చలానా
2. అక్కడేషన్ జిరాక్స్
3. హెల్త్ స్కీమ్ దరఖాస్తు
4. కుటుంబ సభ్యుల ఫోటోలు
5. ఆధార్ కార్డులు
హెల్త్ కార్డ్ డౌన్ లోడ్ చేసుకునే విధానం
Website: www.wjhs.ap.gov.in
User ID: ANM # #
Forgot password: OTP will be sent to your Registered Mobile Number.
Download Health card
-------- Issued by DIPRO, Annamayya District --------
పత్రికా ప్రకటన
జిల్లాలో నీటి ఎద్దడి లేకుండా చూడాలి.....
.....జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి
రాయచోటి, జులై 16:
జిల్లాలో నీటి ఎద్దడి లేకుండా చూడాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి గ్రామీణ నీటి సరఫరా మరియు మునిసిపల్ శాఖల అధికారులను ఆదేశించారు.
మంగళవారం మధ్యాహ్నం రాయచోటి కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ కాల్ నందు గ్రామీణ నీటి సరఫరా శాఖ ఎస్ ఈ, ఏ ఈ లు, డిఈలు మరియు మునిసిపల్ శాఖ అధికారులతో అన్నమయ్య జిల్లాలో గ్రామీణ నీటి సరఫరా మరియు పట్టణ నీటి సరఫరా పై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా గ్రామీణ నీటి సరఫరా శాఖ ఎస్ ఈ ప్రసన్నకుమార్... అన్నమయ్య జిల్లాలో గ్రామీణ ప్రాంతాలలోని ప్రజలకు ఏ విధంగా నీటి సరఫరా చేస్తున్నారు, నీటి సరఫరా కోసం ఎన్ని ట్రిప్పుల టాంకర్లను వాడుతున్నారు, తదితర అంశాలను జిల్లా కలెక్టర్ కు వివరించారు. రాయచోటి, రాజంపేట మునిసిపల్ కమిషనర్లు పట్టణ ప్రాంతాలలో ఏవిధంగా నీటి సరఫరా జరుగుతోంది అన్న అంశాలను కలెక్టర్కు వివరించారు.
అనంతరం జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి మాట్లాడుతూ... జిల్లాలో నీటి ఎద్దడి లేకుండా చూడాలని, జల జీవన్ మిషన్, ఎంపీ ల్యాడ్, తదితర ప్రాజెక్టులకు సంబంధించి పెండింగ్ బిల్లులు లేకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో నీటి సరఫరాపై ఎటువంటి సమస్యలు ఉన్న తన దృష్టికి తీసుకురావాలని అధికారులకు సూచించారు
ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, రాజంపేట మున్సిపల్ కమిషనర్ రాంబాబు, రాయచోటి మునిసిపల్ కమిషనర్ వాసు, గ్రామీణ నీటి సరఫరా శాఖకు సంబంధించిన ఏఈ లు, డి ఈ లు, తదితరులు పాల్గొన్నారు.
---- Issued by DIPRO, Annamayya District ----
పత్రికా ప్రకటన
వినాయక చవితికి మరియు దసరాకు మట్టి విగ్రహాలను మాత్రమే వినియోగించాలి.....
ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో విగ్రహాలను తయారు చేయకుండా కఠిన చర్యలు తీసుకోండి.....
....జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి
రాయచోటి, జూలై 16:
అన్నమయ్య జిల్లాలో వినాయక చవితికి మరియు దసరాకు మట్టి విగ్రహాలను మాత్రమే వినియోగించాలని, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో విగ్రహాలను తయారు చేయకుండా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి అధికారులను ఆదేశించారు.
మంగళవారం ఉదయం రాయచోటి కలెక్టరేట్ లోని కలెక్టర్ చాంబర్ నందు, జిల్లా కలెక్టర్ అధ్యక్షతన, ఆర్ డి ఓ లు, మునిసిపల్ కమిషనర్లు, డిపిఓలతో కూడిన పర్యావరణ పరిరక్షణ కమిటీ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా రాజంపేట మున్సిపల్ కమిషనర్ రాంబాబు, వినాయక చవితి మరియు దుర్గ పూజ పండుగల సమయంలో విగ్రహాలను తయారు చేయడం మరియు నిమజ్జనం కోసం, కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి రూపొందించిన మార్గదర్శకాలను జిల్లా కలెక్టర్ కు వివరించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి మాట్లాడుతూ.... అన్నమయ్య జిల్లాలో నీటి వనరులు తక్కువగా ఉన్నాయని, వీటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉందని తెలిపారు. రాయచోటి, మదనపల్లి, రాజంపేట, బి.కొత్తకోట, మునిసిపాలిటీలలో ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో విగ్రహాలు తయారు చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, అధిక మొత్తంలో జరిమానాలు విధించాలని ఆర్డీవోలకు మరియు మునిసిపల్ కమిషనర్లకు ఆదేశాలు జారీ చేశారు. పంచాయతీలలో ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో విగ్రహాలు తయారు చేస్తున్న వారిపై సంబంధిత చట్టాలను ఉపయోగించి కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా పంచాయతీ అధికారిని ఆదేశించారు. జిల్లాలో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో విగ్రహాల తయారీ నియంత్రణకు ఎస్ఓపిని తయారు చేయాలని ఆర్డీవోలను మరియు మునిసిపల్ కమిషనర్లను ఆదేశించారు. వినాయక చవితికి మరియు దసరాకు విగ్రహాలను మట్టితోనే తయారు చేసే విధంగా అన్ని రకాల చర్యలు తీసుకోవాలన్నారు. మట్టితో చేసిన విగ్రహాలను మాత్రమే ప్రజలందరూ వినియోగించి పర్యావరణ పరిరక్షణలో ప్రజలందరూ భాగస్వాములు అయ్యేవిధంగా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు.
ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, రాజంపేట ఆర్డిఓ మోహన్ రావు, రాయచోటి మున్సిపల్ కమిషనర్ వాసు, రాజంపేట మున్సిపల్ కమిషనర్ రాంబాబు, డిపిఓ ధనలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.
---- Issued by DIPRO, Annamayya District ----
పత్రికా ప్రకటన
రాయచోటి, జూలై 16 : విభిన్న ప్రతిభావంతులైన (దివ్యంగులు) విద్యార్థుల నుండి జాతీయ ప్రీమెట్రిక్ మరియు పోస్టుమాట్రిక్ దరఖాస్తుల ఆహ్వానం. 2024 - 2025 విద్యా సంవత్సరమునకు గాను జిల్లాలో చదువుచున్న విభిన్న ప్రతిభావంతుల (దివ్యంగులు) నుండి ప్రీమెట్రిక్ అనగా 9 మరియు 10 వ తరగతి చదువుచున్న విభిన్న ప్రతిభావంతులు, పోస్టుమాట్రిక్ అనగా ఇంటర్ మరియు ఆ పై తరగతులు చదువుచున్న విద్యార్థుల నుండి జాతీయ ఉపకార వేతనాల దరఖాస్తులను కొరడమైనది. సదరు దరఖాస్తులను అంతర్జాల చిరునామా http://scholarships.gov.in నందు దరఖాస్తు చేసుకొనవలెను. ప్రీమెట్రిక్ విద్యార్థులకు చివరి తేదీ 31-08-2024 మరియు పోస్ట్ మెట్రిక్ విద్యార్థులకు చివరి తేదీ 31-10-2024. కావున పై సదావకాశాన్ని జిల్లాలో విభిన్న ప్రతిభావంతులు గ్రహించి లబ్ది పొందగలరని తెలియజేయడమైనది.
ఆర్.వి.కృష్ణ కిషోర్,
సహాయ సంచాలకులు, విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ, అన్నమయ్య జిల్లా వారిచే జారీ
Home - National Scholarship Portal This site is designed, developed and hosted by National Informatics Centre (NIC) , content provided by National Scholarship Portal.
పత్రికా ప్రకటన 15.07.2024
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో, ప్రపంచ యువత నైపుణ్య దినోత్సవం సందర్బంగా స్కిల్ హబ్ లో శిక్షణ పొందిన 60 మంది మహిళలకు సర్టిఫికెట్స్ మరియు కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమం
కుట్టు మిషన్ల ద్వారా ఉపాధి పొంది తమ కాళ్లపై నిలబడి ఆర్థికంగా ఎదగాలి. శ్రీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, అన్నమయ్య జిల్లా జాయింట్ కలెక్టర్.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో వరల్డ్ యూత్ స్కిల్ డే సందర్భంగా స్కిల్ హబ్ లో టైలరింగ్ లో శిక్షణ పొందిన 60 మంది నిరుద్యోగ మహిళలకు శిక్షణా సర్టిఫికెట్స్ మరియు 25 మంది మహిళలకు కుట్టు మిషన్ల పంపిణి కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అన్నమయ్య జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీ. ఫర్మాన్ అహ్మద్ ఖాన్ గారు పాల్గొనడం జరిగింది.
ఈ కార్యక్రమంలో భాగంగా జాయింట్ కలెక్టర్ గారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్కిల్ హుబ్స్ లో శిక్షణ తీసుకొని యువత లక్ష్యసాధన దిశగా చిత్తశుద్ధితో కష్టపడి పని చేస్తే ఎంతటి కష్టతరమైన పనికూడా విజయవంతం అవుతుందని రాష్ట్ర ప్రభుత్వం యువత ఉద్యోగాలు పొందేలా చాలా పథకాలను చేపట్టిందని, అందులో భాగంగానే నైపుణ్య హబ్ లను ఏర్పాటు చేసిందని, జిల్లా యువత ఇటువంటి సౌకర్యాలను ఉపయోగించుకొని, ఉన్నత ఉద్యోగాలు పొందాలని అన్నారు. విద్యార్థులు చిన్నప్పటి నుంచి క్రమశిక్షణ అలవరుచుకొని ఇష్టంతో కష్టపడి చదివి అన్ని రంగాలలో పట్టుసాధించి నైపుణ్యత కలిగి ఉంటే ఉద్యోగం మనల్ని వెతుక్కుంటూ వస్తుందన్నారు. ఆ దిశగా నైపుణ్యం విషయంలో కూడా యువతీ, యువకులు సీరియస్‌గా ముందుకు సాగాలన్నారు. మహిళలు వీటి ద్వారా ఉపాధి పొంది తమ కుటుంబానికి ఆసరాగా నిలబడాలని సూచించారు.
శిక్షణ తీసుకున్నా మహిళలు మాట్లాడుతూ, యువతీ యువకులకు స్కిల్ హబ్ ఏర్పాటు చేసి స్కిల్ హబ్ లో శిక్షణ పొంది వారికి ఉపాధి పొందే విధంగా, కుట్టు మిషన్లు పంపిణీ చేయడానికి సహకరించినటువంటి జిల్లా జాయింట్ కలెక్టర్ గారికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఎండి సీఈవో గారికి కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ జిల్లా అధికారి హరికృష్ణ, జిల్లా GSWS అధికారి వ్. లక్ష్మిపతి మరియు good neighbours ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీ. నాగేశ్వర రావు . గారు మరియు ఇతర అధికారులు పాల్గొనడం జరిగింది.
బి హరికృష్ణ
డిస్ట్రిక్ట్ స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ.
అన్నమయ్య జిల్లా
పత్రికా ప్రకటన
అన్నమయ్య జిల్లాను కుష్టు వ్యాధి రహితంగా రూపొందించాలి
జిల్లాలో జూలై 18 నుంచి ఆగస్టు 2 వరకు కుష్టు వ్యాధిగ్రస్తులను గుర్తించండి
జాయింట్ కలెక్టర్ ఫర్మన్ అహ్మద్ ఖాన్
రాయచోటి జూలై 15:
అన్నమయ్య జిల్లాను కుష్టు వ్యాధి రహితంగా రూపొందించాలని జాయింట్ కలెక్టర్ ఫర్మన్ అహ్మద్ ఖాన్ వైద్య శాఖ అధికారులను ఆదేశించారు.
సోమవారం రాయచోటి కలెక్టరేట్లోని సమావేశ హాలులో జేసీ అధ్యక్షతన కుష్టి వ్యాధిగ్రస్తులను గుర్తించే జిల్లాస్థాయి సమన్వయ సమావేశం జరిగింది.
జరిగిన కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ... జాతీయ కుష్టు వ్యాధి నిర్మూలన కార్యక్రమం అమలులో భాగంగా... రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో జూలై 18 నుంచి ఆగస్టు 2 వరకు కుష్టి వ్యాధిగ్రస్తులను గుర్తించే కార్యక్రమం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది ఇంటింటి సర్వే నిర్వహిస్తారన్నారు. ఇందులో భాగంగా కుష్టు వ్యాధి అనుమానిత లక్షణాలు ఉన్న ఎడల ఇంటి వద్దకు ఆరోగ్య కార్యకర్తలు పరీక్ష చేయడానికి వచ్చినప్పుడు తప్పనిసరిగా చూపించుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రతి ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలేదా ఆరోగ్య కార్యకర్త వద్ద ఎండిటి మందులు ఉచితంగా లభిస్తాయన్నారు. కుష్టు వ్యాధిగ్రస్తుల గుర్తింపును పటిష్టంగా నిర్వహించాలన్నారు.
సమావేశంలో డిఎంహెచ్ఓ డాక్టర్ కె. కొండయ్య మాట్లాడుతూ... అన్నమయ్య జిల్లాలో కుష్టు వ్యాధిగ్రస్తులను గుర్తించే కార్యక్రమం లో భాగంగా మొత్తము 1237 టీములు ఇంటింటి సర్వే నిర్వహిస్తూ ప్రతి ఒక్కరిని వ్యాధి లక్షణాలు పరిశీలిస్తారన్నారు. ఈ సర్వే పరిశీలించడానికి 502 మంది సూపర్వైజర్లు నియమించారన్నారు.
అదనపు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ శైలజ మాట్లాడుతూ... ఈ సర్వేలో అనుమానంగా ఉన్న వారిని గుర్తించి వైద్యాధికారులు పరిశీలించి వ్యాధి నిర్ధారణ అయితే వెంటనే మల్టీ డ్రగ్ థెరపీ మందులు వెంటనే అందజేస్తారన్నారు. కుష్టు వ్యాధికి సంబంధించిన మందులు ప్రతి ఆరోగ్య కేంద్రంలో ఉచితంగా లభిస్తాయన్నారు. వ్యాధి లక్షణాలను గుర్తించేందుకు ఆరోగ్య సిబ్బందికి టీములకు సర్వేలో ప్రజలందరూ సహకరించాలని వారు కోరారు. ప్రాథమిక దశలోనే ఈ వ్యాధి లక్షణాలను గుర్తించి చికిత్స ఇప్పించగలిగితే అంగవైకల్యం నివారించవచ్చునన్నారు.
అనంతరం కుష్టు వ్యాధి ప్రచార పోస్టర్లను, పాంప్లెట్లను జాయింట్ కలెక్టర్ ఆవిష్కరించారు. కుష్టు వ్యాధి నిర్మూలనకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చికిత్సలపై ప్రజలలో విస్తృతంగా అవగాహన కల్పించాలని జేసి పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో డిఆర్ఓ సత్యనారాయణరావు, అదనపు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ శైలజ , డిస్ట్రిక్ట్ న్యూక్లియస్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి గారు పారామెడికల్ అధికారి రవికుమార్ , డిప్యూటీ పారామెడికల్ అధికారులు శంభు ప్రసాద్ వేణుగోపాల్ మరియు అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.
-------------------/////-----------------
డిపిఆర్ఓ అన్నమయ్య జిల్లా వారిచే జారీ చేయబడినది
పత్రికా ప్రకటన
ప్రజల సమస్యల అర్జీల పరిష్కారంలో అశ్రద్ధ చూపరాదు
జాయింట్ కలెక్టర్ ఫర్మన్ అహ్మద్ ఖాన్
రాయచోటి, జూలై - 15: ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో స్వీకరించిన అర్జీల పరిష్కారంలో అశ్రద్ధ చూపరాదని జాయింట్ కలెక్టర్ ఫర్మన్ అహ్మద్ ఖాన్ అధికారులను ఆదేశించారు.
సోమవారం కలెక్టరేట్లోని సమావేశ హాలు నందు... ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జేసి ఫర్మన్ అహ్మద్ ఖాన్, డిఆర్వో సత్యనారాయణలు ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు.
ఈ సందర్భంగా జేసి మాట్లాడుతూ.... ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో అందిన అర్జీలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి. బియాండ్ ఎస్ఎల్ఏ పరిధిలోకి వెళ్లకుండా ప్రజలు అందజేసిన అర్జీలను నిర్ణీత కాల వ్యవధిలోపు నాణ్యతగా పరిష్కరించాలి. అర్జీలపై క్షేత్ర స్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి పారదర్శకంగా విచారణ చేయాలి. పెండింగ్ దరఖాస్తులు, బియాండ్ ఎస్ఎల్ఏ, రీఓపెనింగ్.. లేకుండా అర్జీదారుడు సంతృప్తి చెందేలా అర్జీలను పరిష్కరించాలన్నారు. అనంతరం అర్జీదారులనుండి వారు అర్జీలను స్వీకరించారు.*
* *ప్రజల నుండి అందిన విజ్ఞప్తులలో కొన్ని...
సంబేపల్లి మండలం దుద్యాల గ్రామం కోడి వాండ్ల పల్లెకు చెందిన చిన్న రెడ్డమ్మ.... తనకు గతంలో వితంతు పింఛను వచ్చేదని... అనారోగ్యం కారణంగా చికిత్స కొరకు హైదరాబాద్ కి వెళ్లడం వల్ల నా పెన్షన్ నిలిపివేశారు. ప్రస్తుతం నాకు వితంతు పింఛన్ ను పునరుద్ధరించాలని జాయింట్ కలెక్టరుకు అర్జీ సమర్పించారు.
మదనపల్లి మండలం వేంపల్లి గ్రామం కోళ్లవారిపల్లె దళితవాడకు చెందిన ఎలుట్ల యశోదమ్మ.... నేను నా భర్త కూలి నాలి చేసుకుని జీవనం గడిపే వారము. అనుకోకుండా రోడ్డు ప్రమాదంలో నా భర్త మృతి చెందాడు. నాకు ఎలాంటి జీవనాధారం లేదు. ఏదైనా ఆర్థిక సహాయం మంజూరు చేసి ఆదుకోవాలని జాయింట్ కలెక్టర్ గారికి అర్జీ సమర్పించారు.
రాయచోటి మండలం వడ్ల చెరువు పోస్టు దిగువ మాదిగ పల్లెకు చెందిన బుసపోగుల సుచిత్ర.... నిరుపేదలైన తమకు నివసించడానికి ఇంటి స్థలం మరియు ఇంటిని మంజూరు చేయవలసిందిగా జాయింట్ కలెక్టరుకు అర్జీ సమర్పించారు.
ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
-------------------/////-----------------
డిపిఆర్ఓ అన్నమయ్య జిల్లా వారిచే జారీ చేయబడినది
పత్రికా ప్రకటన*
మంగంపేట నిర్వాసితులకు పునరావాస పనులను వేగవంతం చేయండి....
....జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి
రాయచోటి, జూలై 12:
మంగంపేట నిర్వాసితులకు పునరావాస పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి అధికారులను ఆదేశించారు.
శుక్రవారం సాయంత్రం రాయచోటి కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి, మంగంపేట బేరైట్స్ ప్రాజెక్టుపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ముందుగా ఏపీఎండిసి అధికారి మంగంపేటలో గల బేరైట్స్ ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివిధ అంశాలను కలెక్టర్ కు వివరించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి, మంగంపేట బేరైట్స్ ప్రాజెక్టు నిర్వాసితులకు చేపడుతున్న పునరావాస పెండింగ్ పనుల గురించి ఆర్ అండ్ బి, హౌసింగ్, ఆర్డబ్ల్యూఎస్, విద్యుత్, తదితర శాఖలను అడిగి తెలుసుకున్నారు. పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలని వారిని ఆదేశించారు. భూ సేకరణ మరియు పట్టాల పంపిణీలో ఏవైనా పెండింగ్ పనులు ఉంటే త్వరగా వాటిని పూర్తి చేయాలని డిఆర్ఓ మరియు తాసిల్దార్ను ఆదేశించారు.
ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, డిఆర్ఓ సత్యనారాయణ రావు, రాజంపేట ఆర్డీవో మోహన్ రావు, ఆర్ అండ్ బి ఎస్ ఈ సహదేవరెడ్డి, పిడి హౌసింగ్ సాంబశివయ్య, గ్రామీణ నీటి సరఫరా శాఖ అధికారి ప్రసన్నకుమార్, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ అధికారి దయాకర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
---- Issued by DIPRO, Annamayya District ----
పత్రికా ప్రకటన
2024- 25 లో రూ.13102 కోట్లతో జిల్లా వార్షిక రుణ ప్రణాళిక ఆమోదం
బ్యాంకర్లు వార్షిక రుణ ప్రణాళిక లక్ష్యాలను అధిగమించాలి
జిల్లా ఆర్థిక ప్రగతికి విరివిగా రుణాలు ఇవ్వాలి
గత సంవత్సరం (2023-24) లక్ష్యాలను అధిగమించి 127.46 శాతం ప్రగతి సాధించడంపై బ్యాంకులకు అభినందన
జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి
రాయచోటి, జూలై - 12:
అన్నమయ్య జిల్లాకు సంబంధించి 2024- 25 లో రూ.13102 కోట్లతో జిల్లా వార్షిక రుణ ప్రణాళిక ఆమోదించడం జరిగిందని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి తెలిపారు.
శుక్రవారం కలెక్టరేట్ లోని మినీ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన బ్యాంకర్లతో జిల్లా సంప్రదింపుల కమిటీ(డిసిసి)మరియు జిల్లా స్థాయి సమీక్ష కమిటీ (డిఎల్ఆర్సి)సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా 2023- 24 ఆర్థిక సంవత్సరంలో నాల్గవ త్రైమాసికం మార్చి 31 నాటికి బ్యాంకులు సాధించిన ప్రగతి, అలాగే 2024- 25 కు ప్రతిపాదిత వార్షిక రుణ ప్రణాళిక అంశాలపై జిల్లా లీడ్ బ్యాంకు మేనేజర్ జి.ఆంజనేయులు కలెక్టరుకు వివరించారు.
అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.... 2023-24 వార్షిక రుణ ప్రణాళికలో మార్చి 31 నాల్గవ త్రైమాసికం చివరినాటికి జిల్లాలో మొత్తంగా రూ.11,514 కోట్లు లక్ష్యం కాగా, రూ. 14,678 కోట్ల రుణాలు అందించి 127.46 శాతం ప్రగతి సాధించడంపై బ్యాంకర్లను కలెక్టర్ అభినందించారు. అదే స్ఫూర్తితో ఈ ఏడాది కూడా జిల్లా ఆర్థిక ప్రగతికి విరివిగా రుణాలు ఇవ్వాలని కలెక్టర్ బ్యాంకర్లను కోరారు. గత సంవత్సరం ప్రాధాన్యత రంగంలో మనం సాధించిన ప్రగతి ఎంత, ఈ ఏడాది సాధించాల్సిన లక్ష్యం ఎంత అన్నది ముఖ్యం. ప్రభుత్వ ప్రాధాన్యత రంగాలకు అధిక ప్రాధాన్యతతో దాదాపు 40 శాతం మేర రుణాలు ఇవ్వాల్సి ఉంటుందని... ఈ విషయాన్ని బ్యాంకర్లు తమ కిందిస్థాయి బ్రాంచ్ లకు కూడా తెలియజేసి రుణాలు అందించేందుకు కృషి చేయాలన్నారు.
2024 - 25 కు ప్రవేశపెట్టిన రూ. 13102కోట్ల వార్షిక రుణ ప్రణాళికలో... ప్రాధాన్యత రంగాలకు రూ.11338కోట్లు, ఇతర ప్రాధాన్యత రంగాలకు. 1764 కోట్లు ప్రతిపాదించడం జరిగిందన్నారు. ప్రాధాన్యత రంగాలు మరియు ప్రభుత్వ పథకాల రుణాల మంజూరులో బ్యాంకర్లు తమ లక్ష్యాలను తప్పనిసరిగా అధిగమించాలన్నారు. ఈ ఏడాది ప్రతిపాదిత వార్షిక రుణ ప్రణాళికలో వ్యవసాయ రుణాలు రూ.9586కోట్లు, వ్యవసాయ అనుబంధ కార్యకలాపాలకు రూ. 116 కోట్లు, వ్యవసాయ మౌలిక సదుపాయాలకు రూ 16 కోట్లు మొత్తంగా వ్యవసాయ రంగానికి రూ 9718 కోట్లు కేటాయించడం జరిగిందన్నారు. వ్యవసాయ ఆధారిత అన్నమయ్య జిల్లాలో వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చి విరివిగా రుణాలు ఇవ్వాలన్నారు. జిల్లాలో పరిశ్రమల స్థాపనకు మరియు ప్రోత్సహించడం కొరకు సూక్ష్మ చిన్న మధ్య తరహా యూనిట్లు(MSME) లకు రూ.1159 కోట్లు రుణాలు అందించాలని ప్రతిపాదించినట్లు పేర్కొన్నారు. అలాగే గృహ నిర్మాణాలకు రూటు 133 కోట్లు, విద్యా రుణాలు 58 కోట్లు, ఇతరత్రా రుణాలకు రూ.270 కోట్లు ప్రతిపాదించినట్లు తెలిపారు.
అలాగే ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్, గ్రామీణ పట్టణ ప్రాంతాలలోని మహిళా సంఘాలకు జీవనోపాధికి నిర్దేశించిన రుణాలు, స్టాండప్ ఇండియా అంశాలలో నిర్దేశించిన లక్ష్యాలను తప్పనిసరిగా సాధించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టి అమలు చేస్తున్న ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలకు బ్యాంకర్లు తమ వంతు తోడ్పాటు అందించి అధికంగా రుణాలు ఇవ్వాలన్నారు. వీధుల్లో చిరు వ్యాపారులు, చేతివృత్తులపై ఆధారపడి జీవిస్తున్న వారికి పెట్టుబడి కింద బ్యాంకుల ద్వారా రుణాలు ఇవ్వాలన్నారు. అలాగే వ్యవసాయంలో ఆరుగాలం శ్రమిస్తున్న కౌలు రైతులు, చేనేతలకు కూడా విరివిగా రుణాలు అందించి ఆదుకోవాలని కలెక్టర్ పేర్కొన్నారు. గ్రామీణాభివృద్ధి వ్యవసాయ శాఖ నాబార్డు బ్యాంకులు సమన్వయంగా చర్చించి ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే కార్యాచరణతో ముందుకు రావాలన్నారు. జిల్లాలో జనాభా ప్రాతిపదికన జిల్లా వ్యాప్తంగా బ్యాంకింగ్ సేవలను అందుబాటులోకి తీసుకురావాలని ఈ మేరకు అవసరమైన చోట బ్రాంచ్ లను ఏర్పాటు చేసేలా బ్యాంకర్లు కృషి చేయాలన్నారు. అనంతరం వివిధ అంశాలలో చర్చించి పలు సూచనలు జారీ చేశారు.
ఈ సందర్భంగా బ్యాంకర్లతో కలిసి 2024-25 జిల్లా వార్షిక రుణ ప్రణాళికను కలెక్టరు ఆవిష్కరించారు.
ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఫర్మన్ అహ్మద్ ఖాన్, జిల్లా లీడ్ బ్యాంకు మేనేజర్ జి.ఆంజనేయులు, ఎస్బిఐ ఆర్ఎం పి.మురళి నాయక్, నాబార్డ్ ఏజీఎం విజయ్ విహారి, దళిత ఇండస్ట్రియల్ అసోసియేషన్ సభ్యులు రాజశేఖర్, యూనియన్, సప్తగిరి బ్యాంక్ ఆర్ఎంలు, వివిధ బ్యాంకర్లు, జిల్లా అధికారులు, డిక్కీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
------------------/////--------------
డిపిఆర్ఓ అన్నమయ్య జిల్లా వారిచే జారీ చేయబడినది
*కలెక్టర్ ఫోటో ఉన్న వాట్సాప్ నెంబర్లతో అప్రమత్తంగా ఉండండి....*
*.....జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి*
రాయచోటి, జూలై 11:
తన ఫోటో ఉన్న వాట్సాప్ నెంబర్ లతో అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి ఒక ప్రకటనలో తెలిపారు.
కలెక్టర్ ఫోటోతో ఉన్న ఒక ఫేక్ వాట్సాప్ నెంబర్ నుండి.. అన్నమయ్య జిల్లాలో పనిచేస్తున్న కొంతమంది అధికారులకు మెసేజ్ లు వెళ్ళినట్టుగా అధికారులు కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి మాట్లాడుతూ... తన ఫోటోతో ఉన్న వాట్సాప్ నెంబర్ లతో జాగ్రత్తగా ఉండాలని, అధికారిక నెంబర్ నుంచి మాత్రమే అధికారులతో సంభాషణ జరుగుతుందని పేర్కొన్నారు.
అధికారిక నెంబర్ నుంచి కాక మరి ఏ ఇతర నెంబర్ నుంచి అయినా ఎటువంటి మెసేజ్లు వచ్చిన దానిపై సైబర్ సెల్ అధికారులకు ఫిర్యాదు చేయాలని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
---- Issued by DIPRO, Annamayya District ----
పత్రికా ప్రకటన
మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకం క్రింద రైతుల పొలాల్లో నాటే పండ్ల మొక్కల నిర్వహణ పనులు పక్కాగా అమలవ్వాలి....
....జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి
రాయచోటి, జూలై 11:
మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకం క్రింద రైతుల పొలాల్లో నాటే పండ్ల మొక్కల నిర్వహణ పనులు పక్కాగా అమలవ్వాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి పేర్కొన్నారు.
గురువారం ఉదయం డ్వామా శాఖ ఆధ్వర్యంలో... చిన్నమండెం మండలం మల్లూరు గ్రామం మరియు బలిజ పల్లెలలో మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకం పనుల ద్వారా ఎస్సీ, ఎస్టీ, చిన్న, సన్న కారు రైతుల పొలాల్లో నాటే పండ్ల మొక్కల నిర్వహణ పనులను ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా చిన్నమండెం మండలం మల్లూరు గ్రామంలో మామిడి తోట కోసం ఏర్పాటుచేసిన ఒక భూమిలో, మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పనులను.... ఒక మామిడి చెట్టును నాటి ప్రారంభించారు.
అనంతరం ఆ పనుల కోసం వచ్చిన కూలీలతో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ … ఎకరాకు ఎన్ని మామిడి చెట్లు వేస్తున్నారని, సబ్సిడీలో మామిడి మొక్కలు అందుతున్నాయా లేదా, కూలీలకు నిర్దిష్ట సమయంలో వేతనాలు బ్యాంకు ఖాతాలలో పడుతున్నాయా లేదా, వంటి పలు ప్రశ్నలు అడిగి తెలుసుకున్నారు. పని వద్ద తాగు నీరు, నీడ, గ్రామం లోని ఏఎన్‌ఎం సహకారంతో ఓ ఆర్ స్ ప్యాకెట్ లూ, ప్రథమ చికిత్స పెట్టె, వంటివి పని వద్ద ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. వీలైనంత ఎక్కువమంది రైతులకు ఈ పథకం చేరేలా చర్యలు తీసుకోవాలని పిడి డ్వామా మద్దిలేటిని ఆదేశించారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవలసినదిగా కోరారు.
అనంతరం బలిజపల్లి గ్రామంలో ఒక మామిడి తోటలోని మామిడి చెట్లకి నీటి సరఫరా కోసం చేపడుతున్న పనులను తనిఖీ చేసి, అక్కడి కూలీలతో మాట్లాడి అధికారులకు తగు సూచనలు చేశారు.
ఈ తనిఖీలో పిడి డ్వామా మద్దిలేటి, డ్వామా శాఖ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
---- Issued by DIPRO, Annamayya District ----
పత్రికా ప్రకటన
జనాభా నియంత్రణపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలి....
పేదరిక నిర్మూలనకు జనాభా నియంత్రణ కీలకం....
....జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి
రాయచోటి, జూలై 11:
జనాభా నియంత్రణపై ప్రతి ఒక్కరు అవగాహన పెంచుకోవాలని, పేదరిక నిర్మూలనకు జనాభా నియంత్రణ కీలకమని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి పేర్కొన్నారు.
ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా, గురువారం ఉదయం రాయచోటి ప్రాంతీయ వైద్యశాల నందు, వైద్య ఆరోగ్యశాఖ, ఐసీడీఎస్ మరియు విద్యాశాఖల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన అవగాహన ర్యాలీని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి జండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి మాట్లాడుతూ.... అధిక జనాభా వల్ల వచ్చే సమస్యలు, చిన్న కుటుంబాల ప్రాముఖ్యతపై అవగాహన పెంచడానికి ప్రతి సంవత్సరం జూలై 11న ప్రపంచ జనాభా దినోత్సవం జరుపుకుంటున్నామన్నారు. ప్రపంచ జనాభా దాదాపు 800 కోట్లు, భారత దేశ జనాభా దాదాపు 144 కోట్లు, ఆంధ్రప్రదేశ్ జనాభా 5 కోట్లకు పైగా ఉందని, ఈ సందర్భంగా తెలిపారు. జనాభా పెరుగుదల వల్ల నిరుద్యోగం మరియు ద్రవయోల్బణం పెరిగి పేదరికం పెరగడానికి అవకాశం ఉందన్నారు. జనాభా పెరుగుదలపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని, వారి సమీప బంధువులకు, స్నేహితులకు దీనిపై అవగాహన కల్పించాలన్నారు. ఆడపిల్లలు మరియు మహిళలు జనాభా పెరుగుదలపై అవగాహన పెంచుకోవాలని, ఆడపిల్లల వివాహానికి కనీస వయస్సు 21 సంవత్సరాలు ఉండేలా చూసుకోవాలన్నారు. జనాభా నియంత్రణలో ఆంధ్రప్రదేశ్ మంచి పురోగతి సాధించిందని, సంతాన ఉత్పత్తి రేటును 1.6 కు తగ్గించగలిగిందన్నారు. దీనిని ఇలాగే కొనసాగించాలని ఆకాంక్షించారు.
అనంతరం ర్యాలీలో పాల్గొన్న పాఠశాల విద్యార్థులు, సిబ్బంది, "అధిక జనాభా దేశానికి భారం", "బిడ్డకు బిడ్డకు ఏడం తల్లి బిడ్డకు వరం", "కుటుంబ నియంత్రణ పాటిద్దాం పేదరికాన్ని దూరం చేద్దాం", "చిన్న కుటుంబం ఆనందానికి మూలం" వంటి నినాదాలతో ర్యాలీని కొనసాగించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ మహమ్మద్ ఖాన్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కొండయ్య, డిసిహెచ్ఓ డేవిడ్ సుకుమార్, రాయచోటి ప్రాంతీయ వైద్యశాల సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
---- Issued by DIPRO, Annamayya District ----
*పత్రికా ప్రకటన*
*జిల్లాలో ఉచిత ఇసుక పాలసీని పారదర్శకంగా అమలు చేయాలి*
** *లాభాపేక్ష లేకుండా వినియోగదారులకు ఇసుక సరఫరా చేయాలి*
** *జిల్లాలో ఇసుక లభ్యతపై డీసిల్టేషన్ పాయింట్లు గుర్తించి... ఫీజిబిలిటీ నివేదిక రూపొందించాలి*
** *హౌసింగ్ శాఖకు 43 వేల మెట్రిక్ టన్నుల ఇసుక అవసరం*
** *అక్రమంగా నిల్వచేసిన ఇసుక డంపులను స్వాధీనం చేసుకోవాలి*
** *రెవెన్యూ, పోలీస్, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ముమ్మరంగా తనిఖీలు చేయాలి*
*జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి*
రాయచోటి జూలై 11:
జిల్లాలో ఉచిత ఇసుక పాలసీని పారదర్శకంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి సంబంధిత అధికారులను ఆదేశించారు.
గురువారం రాయచోటి కలెక్టరేట్లోని తన చాంబర్లో జిల్లా స్థాయి ఇసుక కమిటీ సభ్యులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లాలో ఎన్ని ఇసుక స్టాక్ పాయింట్లు ఉన్నాయి, ఎంత ఇసుక లభ్యత ఉంది, నూతన ఇసుక విధానం ఏమిటి, ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఏమేం చర్యలు తీసుకున్నారని అధికారులను కలెక్టర్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో ఏడు ఇసుక డిపోలు ఉన్నాయని... కానీ అందులో జీరో శాతం ఇసుక ఉందని మైనింగ్ శాఖ ఏడి వివరించారు. ప్రస్తుతం జూలై నుంచి సెప్టెంబర్ వరకు మాన్ సూన్ కాలంలో రివర్లలో మైనింగ్ చేయరాదని ప్రభుత్వం సూచించింది అన్నారు. కలెక్టర్ అధ్యక్షతన జిల్లా స్థాయి ఇసుక కమిటీ నూతన ఇసుక విధానం అమలుపై చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని వివరించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... ప్రభుత్వానికి ఎటువంటి లాభాపేక్ష లేకుండా కేవలం నిర్వహణ చార్జీలు వసూలుతో వినియోగదారులకు డిపోల ద్వారా ఇసుకను సరఫరా చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించి ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ఉత్తర్వులను జిల్లాలో పటిష్టంగా అమలుపరచాలి. అలాగే ప్రభుత్వం టన్ను ఇసుక ధరను ఒక్కో రీచ్ పరిధిలో స్టాక్ పాయింట్ కు ఒక్కొక్క ధరను నిర్ణయించిందని... నిర్ణయించిన టన్ను ధరకు రవాణాచార్జీలు అదనంగా చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఈ విషయాలను ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.
జిల్లా నందలి నదులు, కెనాల్స్, బ్యారేజీలు, డ్యామ్ ల పరిధిలో డీసిల్టేషన్ పాయింట్లను వెంటనే గుర్తించి ఇసుక లభ్యతపై ఫీజబిలిటీ రిపోర్టును రెండు రోజుల్లోగా సమర్పించాలని ఇరిగేషన్ శాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఫీజిబిలిటీలో ఎన్విరాన్మెంటల్ నిబంధనలను పరిగణలోకి తీసుకోవాలన్నారు. డిసిల్టేషన్ పాయింట్లు గుర్తించి ఇసుక లభ్యత అందుబాటులోకి వచ్చిన పిదప ప్రభుత్వ మార్గదర్శకాలు అనుసరించి వాటికి అనుమతుల మంజూరుకు చర్యలు తీసుకోవాలని గనుల శాఖను ఆదేశించారు. జిల్లాలో మంజూరైన గృహాల నిర్మాణానికి ఎంత మేర ఇసుక అవసరం అవుతుందని హౌసింగ్ పీడిని కలెక్టర్ ప్రశ్నించగా... అంచనాగా 43 వేల మెట్రిక్ టన్నుల ఇసుక అవసరం అవుతుందని హౌసింగ్ పీడి పేర్కొన్నారు. ఇసుక లభ్యతపై ఫీజిబిలిటీ నివేదిక అందిన తర్వాత మళ్లీ ఒకసారి జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశమై... స్టాక్ పాయింట్లు ఏర్పాటు, ఎక్కడెక్కడ ఇసుక డంప్ చేయాలి, వాటి ధర తదితరాలను నిర్ణయించి వాటి వివరాలతో అక్కడ బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. జిల్లాలో అక్కడక్కడ అక్రమంగా ఇసుక డంపులు ఉన్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయని... జిల్లా వ్యాప్తంగా రెవెన్యూ, పోలీస్, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు క్షుణ్ణంగా తనిఖీలు చేయాలని ఆదేశించారు. అక్రమ ఇసుక డంపులు గుర్తించగానే గనుల శాఖ వెంటనే నోటీసులు జారీ చేసి వాటిని స్వాధీనం చేసుకోవాలని సూచించారు. ఇప్పటివరకు జిల్లాలో దాదాపు 45 వేల మెట్రిక్ టన్నుల ఇసుకను స్వాధీనం చేసుకోవడం జరిగిందని... నోటీస్ పీరియడ్ ముగిసిన పిదప మార్గదర్శకాల మేరకు తగిన చర్యలు తీసుకోవాలని మైనింగ్ శాఖను ఆదేశించారు. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు జిల్లా స్థాయిలో కంట్రోల్ రూమ్, టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయాలన్నారు. అనంతరం వివిధ అంశాలలో తగు సూచనలు జారీ చేశారు.
ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఫర్మన్ అహ్మద్ ఖాన్, అడిషనల్ ఎస్పీ రాజ్ కమల్, మైనింగ్ శాఖ ఏడి రవికుమార్, హౌసింగ్ పిడి శివయ్య, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ ప్రసన్నకుమార్, డిపిఓ ధనలక్ష్మి, ఎస్ఈబి, ట్రాన్స్పోర్ట్, ఇరిగేషన్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.
-------------------/////-----------------
*డిపిఆర్ఓ, అన్నమయ్య జిల్లా వారిచే జారీ చేయబడినది*